ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రజల మూడు దశాబ్దాల కల ఎట్టకేలకు మంగళవారం నెరవేరింది. కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్‌ప్రభు విజయవాడలో నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. దీంతో తొలిసారిగా నంద్యాల నుంచి కడప వరకు ప్రయాణికుల సౌకర్యార్థం డెమో రైలు నడిపారు. జమ్మలమడుగు మీదుగా ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్‌కు రాత్రి 7.10 గంటల సమయానికి రైలు చేరింది. రైలు కూత వినపడడంతో ఈ ప్రాంత పట్టణ, గ్రామీణ ప్రజలు పెద్దఎత్తున కేకలు వేస్తూ పరుగుపరుగునా వచ్చారు. పౌరసరఫరాల ఛైర్మన్ లింగారెడ్డి నంద్యాల నుంచి రైలులోనే ప్రొద్దుటూరు వచ్చారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఆయన వెంట వచ్చారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఇతర వైకాపా నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌కు చేరుకున్నారు. తన హయాంలో రైలు ప్రొద్దుటూరుకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన పేరు భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే రాచమల్లు ఆనందం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు నుంచి నూతన రాజధాని అమరావతికి వెళ్లడానికి నేరుగా రైళ్లను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. సాయంత్రం 4.30 గంటల నుంచే తెదేపా నియోజకవర్గబాధ్యుడు నంద్యాల వరదరాజులరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పురపాలిక ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డి, పట్టణ తెదెపా అధ్యక్షుడు గంటసాల వెంకటేశ్వర్లు, భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, ఇతర నాయకులు స్టేషన్‌కు చేరుకున్నారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు దండు వీరయ్య మాదిగ నంద్యాల నుంచి రైలులో ప్రొద్దుటూరుకి వచ్చారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జెండా వూపి...
more... రైలును ఎర్రగుంట్లకు పంపించారు. యువకులు, పిల్లలు సైతం రైలు ఎక్కి సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. గ్రామీణ సి.ఐ. ఓబులేసు, ఎస్సైలు ఆంజనేయులు, మహేశ్, పోలీసులు స్టేషన్లో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కౌన్సిలర్లు, ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.
గండికోట ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలి
జమ్మలమడుగు: ఎర్రగుంట్ల-నంద్యాల మార్గంలో నడిచే రైలుకు గండికోట ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాలలో నిర్వహించిన ప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పాల్గొన్నారు. ఎస్.ఉప్పలపాడు వద్ద మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, టీబీహెచ్‌ఎల్‌సీ ఛైర్మన్ శ్రీనివాసులరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జంబాపురం రమణారెడ్డి, కడప రిమ్స్ ఛైర్మన్ మురళీధర్‌రెడ్డి, తెదేపా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, మాజీ ఎంపీపీ గిరిధర్‌రెడ్డి రైలెక్కారు. జమ్మలమడుగులో పీఠాధిపతి గౌస్‌పీరాఖాద్రి, ఛైర్పర్సన్ తులసమ్మ, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శివనాథరెడ్డి, ఎమ్మెల్యే కుమారుడు సుధీర్‌రెడ్డి, అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణించారు. రైలు రాకతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.